విజయదశమికి ప్రారంభం అవుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ మూవీ

వాస్తవం సినిమా : విజ‌యాల‌తో దూసుకుపోతూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొన్న కుర్ర హీరో విజయ్ దేవరకొండ “నోటా”తో పరాజం చూడాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ విజ‌యం కోసం వేట ప్రారంభిస్తున్నాడు. త‌న‌ను చూసి న‌వ్వుకుంటున్న వాళ్ల‌కు త్వ‌ర‌లోనే స‌మాధానం చెప్తానంటున్నాడు. పండ‌గ చేస్కోండి.. మ‌ళ్ళీ ఆ ఛాన్స్ ఇవ్వ‌నంటూ ఈ మ‌ధ్యే లెట‌ర్ కూడా రాసాడు. ఇక ఇప్పుడు ఈయ‌న కొత్త సినిమా ద‌స‌రా రోజు మొద‌లు కానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది.
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.46 గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను నిర్మించ‌నుంది. “ఓన‌మాలు”, “మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజు” లాంటి సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండతో ఈయ‌న‌కు ఇదే తొలి కాంబినేష‌న్. అక్టోబ‌ర్ 18న హైద‌రాబాద్‌లో ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు.. చిత్రానికి ప‌ని చేయ‌నున్న సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు తెలియనున్నట్లు సమాచారం.