ధోనీ స్థానంలో కాదట….దినేష్ స్థానంలో!

వాస్తవం ప్రతినిధి: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ టెస్టుల్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఐపీఎల్‌లో చిచ్చర పిడుగులా చెలరేగి భారీ సిక్సర్లు బాదిన అతడు ఇక వన్డే ఫార్మాట్ లో ఎలా తనని తాను నిరూపించుకుంటాడా అన్న దానిపై ఆశక్తీ నెలకొంది. వెస్టిండీస్‌తో వన్డే‌ సిరీస్‌లో టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ ధోనీ స్థానంలో పంత్‌ను ఎంపిక చేస్తారన్న వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే  వికెట్ల వెనకాల ఎంతో చురుకుగా కదులుతున్న ధోనీ మునుపటిలా పరుగులు చేయలేక పోతుండటంతో ఈ ఊహాగానాలు నిజమే అనిపించింది. అయితే నిజానికి పంత్‌ జట్టులోకి వస్తుంది ధోనీ బదులు కాదని, మరో వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో అతడు జట్టులోకి రానున్నాడని తెలిసింది. ఏడాది కాలంగా టీమిండియా తరఫున దినేశ్‌ కార్తీక్‌ నిలకడగానే రాణించాడు. సమయోచితంగా ఆడాడు. రెండు మూడు మ్యాచుల్లో విజయాలు అందించాడు. కీలక సమయాల్లో పరుగులు చేస్తున్నాడు. అతడితో వచ్చిన చిక్కల్లా ఏమిటంటే 20, 30 పరుగులను అర్ధశతకాలు, శతకాలుగా మలవలేకపోవడం అని తెలిసింది. ఇది ఎప్పటికైనా సమస్యగానే మారుతుందని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. అందుకే భారీ సిక్సర్లు బాదగల పంత్‌ను తీసుకుంటే మ్యాచ్‌లు ముగించగలడని జట్టు యాజమాన్యం భావిస్తోందట. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో మిడిలార్డర్‌లో పంత్‌ కుదురుకుంటే జట్టు కూర్పులో ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే విండీస్‌ సిరీస్‌లో పంత్‌ అరంగేట్రం లాంఛనమే అనిపిస్తోంది.