నవ దంపతులపై దాడి..భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం చేసిన దుండగులు

వాస్తవం ప్రతినిధి: నవ దంపతులపై దాడిచేసి, భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారానికి నలుగురు యువకులు తెగబడ్డారు. గుడికి వెళ్లి వస్తున్న కొత్త జంటను దారిలో అటకాయించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తిరువల్లూరు గ్రామానికి చెందిన ఓ కొత్త జంట సోమవారం సాయంత్రం సమీపంలోని గుడికి వెళ్లారు.

పూజలు చేసిన అనంతరం తిరిగి గ్రామానికి బయలు దేరారు. అప్పటికే చీకటి పడింది. ఇంతలో హఠాత్తుగా నలుగురు యువకులు దారి మధ్యలో కొత్త జంటను అడ్డుకున్నారు. వరుడిపై కత్తితో దాడిచేసి పక్కకు లాగేశారు. అనంతరం వధువును రోడ్డు పక్కకు తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. తన కళ్లముందే జరుగుతున్న ఘోరాన్ని చూడలేని భర్త కేకలు వేసుకుంటూ సమీపంలోని గ్రామానికి వెళ్లి విషయం చెప్పడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారిని చూసిన నిందితులు పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.