విహారీ కి దక్కని చోటు

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా టెస్టు మ్యాచ్ లలో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు హనుమ విహారి తన కెరీర్ లో రెండో టెస్టు ఆడేందుకు ఇంకా సమయం పట్టనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌ వేదికగా భారత్‌-విండీస్‌ల మధ్య జరగనున్న రెండో టెస్టులో ఆడే అవకాశం వస్తుందని ఆశించిన విహారికి ఎదురుచూపులే మిగిలాయి. ఉప్పల్‌ మైదానంలో చెమటోడ్చి ప్రాక్టీస్‌ చేసినప్పటికీ సెలక్టర్లు విహారి వైపు కన్నెత్తయినా చూడలేదు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా విండీస్‌తో రెండో టెస్టు ఆడబోయే జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. ఇందులో విహారికి చోటు లభించక పోవడం గమనార్హం. ఇక ఈ టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ అయినా ఎంపికవుతాడని భావించినా అతడికీ చోటు దక్కలేదు. మొదటి టెస్టులో భాగంగా జట్టును ఎంపిక చేసినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సెలక్టర్లు.. అజింక్య రహానేను జట్టులో కొనసాగించారు. ఇక మొదటి టెస్టులో తమ ప్రతాపం చూపించిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ షమిలను జట్టులో కొనసాగించారు. శార్దూల్‌ ఠాకూర్‌ను బౌలింగ్‌ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. మహ్మద్‌ సిరాజ్‌కు ఎదురుచూపులు తప్పలేదు.