‘సైరా’ లో విజయ్ సేతుపతి .. సుదీప్ ల ఫస్టులుక్

వాస్తవం సినిమా: చిరంజీవి కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా ‘సైరా’ రూపొందుతోంది. 200 కోట్ల బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన భార్య పాత్రలో నయనతార కనిపించనుంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను విడుదల చేయనున్నారు.

అందువలన ఆయా భాషల నుంచి అమితాబ్ .. విజయ్ సేతుపతి .. సుదీప్ లను కూడా కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారు. ఇప్పటికే అమితాబ్ పాత్రకి సంబంధించిన లుక్ బయటికి వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి .. సుదీప్ ల ఫస్టులుక్ లను వదిలారు. విభిన్నమైన వేషధారణతో ఇద్దరూ కూడా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా ఈ ఇద్దరి కెరియర్లోను ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అమిత్ త్రివేది సంగీతం .. రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయని అంటున్నారు.