నితీష్ పై చెప్పు విసిరిన వ్యక్తి….అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పైకి చెప్పు విసిరాడు ఒక వ్యక్తి. గురువారం జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్ సమావేశంలో నితీష్ కుమార్‌ మాట్లాడుతుండగా నితీష్ పై ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. దీనితో చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌కు చెందిన చందన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్.. ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తాను అగ్ర కులానికి చెందిన వ్యక్తి కావడం, రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా ఉద్యోగం లభించకపోవడంతో తన అసంతృప్తిని ఇలా వెల్లగక్కినట్లు చందన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. చందన్‌ నితీష్‌పైకి చెప్పు విసిరిన వెంటనే జేడీయూ యూత్ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. పోలీసులు వచ్చి చందన్‌ను విడిపించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నితీష్ పక్కనే ఉన్నారు. సీఎం నితీష్‌ కుమార్‌పైకి చెప్పు విసరడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2016లోనూ పీకే రాయ్ అనే వ్యక్తి నితీష్‌పైకి చెప్పు విసిరిన సంగతి తెలిసిందే.