భార్య తలతో ఠాణాకు వచ్చిన భర్త

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయన్న సంగతి తెలిసిందే. బంధాలు..బంధుత్వాలు పక్కనబెట్టి మరీ..పంతాలు పట్టింపులకు పోయి క్షణికావేశంలో హత్యలు…చేస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. అయితే తాజాగా వెలుగు చూసిన ఉదంతంలో కట్టుకున్న వాడే కాలయముడిగా మారాడు… భార్యపై అనుమానంతో వెంబడించి మరీ కొడవలితో తల నరికేసిన ఘటన కడప జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.
జిల్లాలోని సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం వడ్డెపల్లె సమీపంలో పుసుపులేటి వెంకటరమణ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన రాణిని 19 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు… వీరికి ఇద్దరు కుమారులు కాగా… అందులో పెద్ద కుమారుడు కొద్ది నెలల కిందటే మృతిచెందాడు… అయితే గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వెంకటరణ అక్కడ పనిచేస్తూ… తాను సంపాదించిన దాంట్లో దాదాపు రూ. 10 లక్షల వరకు భార్యకు పంపాడు. ఆ డబ్బుతో రాయచోటిలో ఇంటి స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది రాణి. అయితే వారి కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. తరచూ భార్యతో గొడవ పడే వెంకటరమణ… మరొకరితో కలిసి తిరుగుతున్నావని గొడవ పడేవాడు. దీంతో భార్యపై కసిపెంచుకున్న భర్త… నిన్న సాయంత్రం రాయచోటిలో బైకుపై ప్రియుడుతో కలిసి వెళ్తున్న రాణిని చూశాడు… వారిని వెంబడించి గ్రామ సమీపంలోని శ్మశాన వాటిక దగ్గరకు రాగానే కొడవలితో దాడి చేసి రాణిని తల నరికేశాడు. ఈ ఘటనలో ప్రియుడు తప్పించుకోగా… నరికిన తలను గోనె సంచిలో వేసుకుని సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు వెంకటరమణ. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.