గిడ్డి ఈశ్వరికి మావోల హెచ్చరిక

వాస్తవం ప్రతినిధి: అధికారపార్టీలకి చెందిన ఎమ్మెల్యే కిడారి.. మాజీ ఎమ్మెల్యే సివేరిలను దారుణంగా హతమార్చిన మావోలు తాజాగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన అంశాల్ని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. తాజాగా టీడీపీలోకి జంప్ అయిన గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి తీవ్రమైన హెచ్చరిక చేశారు.

అధికార పార్టీలో చేరేందుకు ఆమె రూ.20 కోట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజాద్రోహి.. గిరిజన ద్రోహి.. అధికార పార్టీ తొత్తుగా వ్యవహరించే గిడ్డి ఈశ్వరి తమను నిందించటమా అని మండిపడిన మావోలు.. ఆమె రూ.20 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుబోయారని బహిరంగ లేఖలో వెల్లడించారు. తాను తీసుకున్న రూ.20కోట్లను రెండు నెలల వ్యవధిలో గిరిజనులకు పంచిపెట్టాలని సూచించారు.తనకు అందిన అవినీతి సొమ్మును రెండు నెలల్లో గిరిజనులకు పంచకుంటే కిడారికి పట్టిన గతే ఈశ్వరికి కూడా పడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

మరోవైపు మావోయిస్టుల లేఖగా చెబుతున్న దీనిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల భాష భిన్నంగా ఉంటుందని, వారు వాడే కాగితాలు కూడా వేరేగా ఉంటాయని అంటున్నారు. ఈ లేఖ విషయమై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ అది మావోయిస్టులు రాసిన లేఖ కాదని తేల్చి చెప్పారు. అది ఎవరు రాశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.