తమిళనాడు వీక్లీ పత్రిక నక్కీరన్ ఎడిటర్ అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు వీక్లీ పత్రిక నక్కీరన్ ఎడిటర్,ప్రచురణ కర్త ఆర్ ఆర్ గోపాల్ ను చెన్నై విమానాశ్రయంలో మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌పై అపఖ్యాతికరమైన వార్తను ప్రచురించారన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పుణె వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లిన ఆయనను ఇద్దరు డిప్యూటీ కమిషనర్లతో పాటు ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లు కలిసి వాహనంలో బలవంతంగా ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలని విదుద్‌నగర్‌లోని కళాశాల విద్యార్థులను బలవంత పెట్టిన లెక్చరర్‌ నిర్మల దేవీకి గవర్నర్‌ కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు కథలను ప్రచురించడంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. కాని ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పష్టత లేదు. గోపాల్‌ను విచారణ నిమిత్తం చింతాడ్రిపెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ట్రిప్లికేన్‌, అంబత్తూర్‌ రెండు వేర్వేరు కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారని పోలీసు వర్గాల సమాచారం.