సంతకం ఫోర్జరీ కేసులో బీజేపీ నాయకురాలి అరెస్ట్!

వాస్తవం ప్రతినిధి: ఒక సంతకం ఫోర్జరీ కేసులో బీజేపీ నాయకురాలిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. తన తండ్రి ఆస్తి పత్రాలపై సంతకాలను ఫోర్జరీ చేసిందంటూ మాజీ ఎంపీ డి.విఠల్‌రావు కూతురు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో బీజేపీ నాయకురాలు ఉప్పల శారదపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోని అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా కాంగ్రెస్ నేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీకి ఇల్లు ఉంది. అయితే ఆ ఇంటిని లీజుకు తీసుకున్న ఉప్పల శారద…తమ సంతకాలను ఫోర్జరీ చేసిందని, ఫోర్జరీ పత్రాలతో స్థలాన్ని కాజేసేందుకు డా క్యుమెంట్లు సృష్టించిందంటూ విఠల్‌రావు కూతురు దేవరకొండ విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటిపై ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ పత్రాలతో తమ స్థలాన్ని ఆక్రమించుకుని కూల్చివేతలు చేపట్టిందని, ఇదేంటని ప్రశ్నిస్తే కోర్టులో కేసు తేలేందుకు ఎన్నో ఏండ్లు పడుతుందని, స్థలాన్ని దక్కనీయకుండా చూస్తానంటూ బెదిరిస్తున్నారని విజయ ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు శారదపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.