ఎన్నికల బందోబస్తు ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన రజత్ కుమార్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతలు, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తాజాగా సమీక్ష నిర్వహించారు. కోడ్ ఉల్లంఘించినవారిపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. అలానే నగదు, మద్యం సరఫరాపై నిరంతర నిఘా ఉంచాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో అలజడి సృష్టించిన వ్యక్తులు, సమస్యాత్మక ప్రాంతాల వివరాలను సమర్పించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. కేంద్ర బలగాలను వినియోగించుకోవడం, సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని మోహరించడంపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. అలానే  లైసెన్స్‌డ్ ఆయుధాలున్నవారి గురించి ఆరా తీయడంతోపాటు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారితోపాటు కేసులు నమోదుచేసి రోజువారీగా నివేదికలను ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించినట్టు సమాచారం. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.