దోపిడీ దొంగలు బీభత్సం ..సాయిబాబా ఆలయంలో దారుణ హత్య

వాస్తవం ప్రతినిధి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తగూడెం ఫైర్ స్టేషన్‌ ఎదురుగా ఉన్న సాయిబాబా ఆలయంలో వాచ్‌మెన్‌ను హత్యచేసి హుండీలో డబ్బు దోచుకెళ్లారు. శనివారం అర్థరాత్రి దాటాక దొంగలు గోడదూకి ఆలయంలోకి దొంగలు చొరబడ్డారు. అక్కడే విధుల్లో ఉన్న వాచ్‌మెన్ వెంకటరెడ్డిని గమనించారు. వాచ్‌మెన్ నిద్రలేస్తే ఎక్కడ దొరికిపోతామన్న భయంతో అతడ్ని హత్య చేయాలని భావించారు. వెంటనే ఓ బలమైన ఆయుధంతో తలపై మోదారు. అరుపులు బయటకు వినపకుండా కండువాతో నోరు కట్టేశారు. తలపై గట్టిగా కొట్టడంతో వాచ్‌మెన్ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత ఆలయంలోకి చొరబడి.. హుండీల్లో డబ్బును ఎత్తుకెళ్లారు. ఉదయం గుడికి వచ్చిన భక్తులు.. వాచ్‌మెన్ చనిపోవడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణం నడిబొడ్డున ఘటన జరగడంతో.. ఎస్పీ కూడా స్పాట్‌ను పరిశీలించారు. ఆలయంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.