షాబాజ్ షరీఫ్ ని అరెస్ట్ చేసిన అవినీతి నిరోధక శాఖ

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌ను అవినీతి నిరోధక బృందం అరెస్టు చేసింది. రూ.1,400 కోట్ల (పాక్‌ కరెన్సీ) హౌజింగ్‌ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్‌ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం షరీఫ్‌ను అరెస్టు చేసింది. రెండు అవినీతి కేసుల్లో ఆయన ప్రవేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన నిబంధనలను ఉల్లంఘించి తనకు అనుకూలంగా ఉన్న వారికి కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నేషనల్ అకౌంటెబిలిటీ(ఎన్‌ఏబీ) బ్యూరో ఆదేశించగా శుక్రవారం హాజరయ్యారు. అయితే తమ ప్రశ్నలకు షాబాజ్ సరైన సమాధానాలు ఇవ్వలేదని భావించిన అధికారులు ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. శనివారం ఆయనను కోర్టు ముందు హాజరుపర్చుతారు. దాదాపు రూ.839 కోట్ల విలువ గల అశీనా హౌసింగ్ ప్రాజెక్టు పథకం, రూ.239 కోట్ల విలువ గల పంజాబ్ సాఫ్ పానీ కంపెనీల్లో జరిగిన అవినీతిలో షాబాజ్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.