కాంగో లో ఘోర ప్రమాదం….అగ్నికి ఆహుతైన 50 మంది!

వాస్తవం ప్రతినిధి: కాంగోలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టేరియల్‌ హైవేపై వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని డీ కొనడం తో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం లో దాదాపు 50 మంది అగ్నికి ఆహుతికాగా,మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. రెండు వాహనాలు ఒక్కసారిగా డీ కొనడం తో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి వాహనాల్లో ఉన్న వాళ్లు ఉన్నట్లే అగ్నికీలల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. అంతేకాకుండా ఈ ప్రమాదం కారణంగా హైవేపై వెళుతున్న పలు వాహనాలు కూడా అగ్నికి ఆహుతై బుగ్గయ్యాయి. దీనితో క్షతగాత్రుల ఆర్తనాదాల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని కాంగో తాత్కాలిక గవర్నర్‌ అటో మటుబువనా ధ్రువీకరించారు. హైవే పక్కన ఇళ్లకు మంటలు అంటుకోవడంతో అవి వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేసే పనిలో అగ్నిమాపక దళాలు నిమగ్నమయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.