జైట్లీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల

వాస్తవం ప్రతినిధి: 2019 లో జరగబోయే ఎన్నికలు, సుస్థిర‌, అరాచ‌క కూట‌మికి మ‌ధ్య పోటీగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో మంత్రి య‌న‌మ‌ల మీడియాతో మాట్లాడుతూ… సుస్థిరత పేరుతో  ప్రజలు ఇచ్చిన తీర్పును బిజెపి కాలరాసిందని,ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చింది అంటూ ఆయన ఆరోపించారు. అలానే రాజ్యాంగ విలువలను భ్రష్టుపట్టించిందని, స్వతంత్రంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలను జేబుసంస్థలుగా మార్చింది,సిబిఐ,ఈసి,ఐటి అన్నింటినీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోంది అని యనమల ఆరోపించారు. ఉదయం 12గంకు ఈసీ ప్రెస్ మీట్ అనిచెప్పి ప్రధాని మోదీ అజ్ మీర్ సభ ఉందని 3గం కు మార్చడమే తాజా రుజువు. సుస్థిర ప్రభుత్వం అంటే వ్యవస్థలను ఎలాపడితే అలా వాడుకోమని కాదు. సుస్థిర ప్రభుత్వం అంటే ఏదిపడితే అది చేద్దామని కాదు. సుస్థిర ప్రభుత్వాలు ప్రజల మేలుకు దోహదపడాలి. వ్యవస్థల నిర్మాణానికి దోహదపడాలి. అంతే తప్ప ప్రజల హక్కులను కాలరాయడం, వ్యవస్థలను పతనం చేయడం కాదు. రాజ్యాంగ విలువలు కాపాడలేని సుస్థిర ప్రభుత్వాలు ఎందుకు..? ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే సుస్థిర ప్రభుత్వాలు అవసరమా..? ప్రతిపక్షాలను అణిచివేసేది సుస్థిర ప్రభుత్వం కాదు. దేశ ప్రజలు కోరుకునేది ఇటువంటి సుస్థిర ప్రభుత్వాన్ని కాదు అని యనమల అన్నారు. అలానే ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని,మోదీ ఫారిన్ ట్రిప్పులన్నీ ఫారిన్ డీల్స్ కోసమే అని ఆరోపించారు.  దేశ ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్తున్నారా..? డిఫెన్స్ స్కామ్ ల కోసం విదేశాలకు వెళ్తున్నారా..?రాఫెల్, కోల్ స్కామ్, బ్యాంకుల దివాలా, ఆర్ధిక నేరస్తుల పరారీ, వేటిపైనా మోదీ ఎందుకని నోరు తెరవరు..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. భాగస్వామ్య పక్షాలను మోసం చేసే బిజెపి ఇతర పార్టీల కూటమిపై ఎలా మాట్లాడుతుంది.? గత 4ఏళ్లుగా కేంద్రంలో నానా రకాల విఫల ప్రయోగాలు చేస్తున్నారు. అరాచక పాలన చేస్తున్నారు. ప్రతిపక్షాలను బెదిరించి చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారంటూ మంత్రి య‌న‌మ‌ల మండిపడ్డారు.