ధోనీ కింగ్ ఆఫ్ క్రికెట్: హాంగ్ కాంగ్ క్రికెటర్  

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్.ధోనీ కి ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను అందరూ కూడా ముద్దుగా ‘ మిస్టర్‌ కూల్‌’ అని పిలుచుకుంటారు. నిజానికి ధోనీ కూడా ఆ పేరుకు సార్థకత చేకూరుస్తూ ఉంటాడు. హాంకాంగ్‌ క్రికెటర్‌ ఎహెసాన్‌ ఖాన్‌ కూడా ధోనీకి అభిమాని. ఇక ధోనీని, సచిన్‌ని ఔట్‌ చేయాలనేది ఖాన్‌ కల. ధోనీనైనా తనే స్వయంగా పెవిలియన్‌కు పంపాలనేది అతడి లక్ష్యం. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో భాగంగా హాంకాంగ్‌-భారత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతడి చిరకాల వాంఛ తీరింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎహెసాన్‌ కారణంగానే ధోనీ డకౌట్‌ అయ్యాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయాన్ని స్వయంగా ఖాన్‌ మీడియాకు చెప్పాడు. క్రికెట్‌ తర్వాత తన భవిష్యత్తు ప్రణాళికలేంటని అడిగిన ప్రశ్నకు ఖాన్‌ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ‘సచిన్‌ క్రికెట్‌ దేవుడయితే ధోనీ ‘కింగ్‌ ఆఫ్‌ క్రికెట్‌’. భవిష్యత్తులో నా జీవితం మీద నేను ఓ పుస్తకం రాయాలనుకుంటున్నా. అందులో ప్రధాన భాగం ఎం.ఎస్‌ ధోనీదే ఉంటుంది. ఈ పుస్తకాన్ని నా మనవళ్లతో చదివిస్తాను. ఎందుకంటే జీవితం ఓ అద్భుతమైన కథ. సచిన్‌, ధోనీలను ఔట్‌ చేయాలనేది నా చిరకాల కోరిక. సచిన్‌తో ఎలాగూ ఇప్పుడు సాధ్యపడదు. ఇందుకు నాకు మొదట్లో చాలా బాధేసింది. కానీ, ధోనీని ఔట్‌ చేయగలిగాను. దీంతో నా కోరిక తీరింది. నేను రాసే పుస్తకంలో ఆయన సంబంధించిన అంశాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. ఈ విధంగా నా అభిమానాన్ని చాటుకుంటాను’ అని వివరణ ఇచ్చాడు.