ఉత్తరాంధ్ర భాష, యాసలను అపహాస్యం చేయడం తగదు : పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడానికి భాష, యాసను అవమానించడం కూడా ఒక కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. దానివల్ల తెలంగాణ ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని వెల్లడించారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్ల అదేరకమైన వివక్ష కొనసాగుతోందనీ, వారి భాషను, యాసను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే మరోసారి రాష్ట్ర విభజన తప్పకపోవచ్చని హెచ్చరించారు. ఒకరి భాష, యాసను అపహాస్యం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు.

‘మన దేశ భాషల యాసలను అగౌరవపరిచి, అపహాస్యం చేయడం కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ చర్యలు అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని సహజవనరులు ఉన్నా వెనుకబాటుకు గురవుతున్నారు. నాయకులు అన్ని రంగాల్లో బాగుపడుతున్నా ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర భాష, యాసలను అపహాస్యం చేయడం తగదు’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలు ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమానికి నాంది పలుకుతాయని పవన్ పరోక్షంగా హెచ్చరించారు.