షా ని వీరూ తో పోల్చొద్దు: గంగూలీ

వాస్తవం ప్రతినిధి: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ ఓపెనర్‌ పృథ్వీ షా శతకం సాధించడం తో అందరి చూపు అతడిపైనే పడింది. ఈ నేపధ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, షా ఆడిన తీరు, షాట్లు కొట్టిన విధానం టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ను గుర్తు చేసిందని అతడిపై నెటిజన్లు, సీనియర్‌ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురింపించడం తో తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్  గంగూలీ స్పందించాడు. పృథ్వీని సెహ్వాగ్‌తో పోల్చవద్దని కోరాడు. అలానే షాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘షాను సెహ్వాగ్‌తో పోల్చడం సరికాదు. సెహ్వాగ్‌ జీనియస్‌, పృథ్వీది కూడా అద్భుతమైన ప్రదర్శన. క్రికెట్‌లో భాగంగా అతడిని ప్రపంచం అంతా చుట్టి రానివ్వండి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా గడ్డపై అతడు పరుగుల వరద పారిస్తాడు. కానీ అతడిని మాత్రం వీరూతో పోల్చద్దు. తొలి టెస్టులోనే శతకం చేసిన రోజు షాకి జీవితాంతం గుర్తుండిపోయే రోజు. దులీప్‌, రంజీ ట్రోఫీల తొలి మ్యాచ్‌ల్లో అతడు శతకాలు చేశాడు. ఇప్పుడు టెస్టుల్లోనూ శతకం సాధించాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. బ్యాటింగ్‌లో అతడి సానుకూల దృక్పథం, దూకుడు, యాటిట్యూట్‌ అద్భుతం అని గంగూలీ కొనియాడాడు.