కరణ్ నాయర్ ఎంపిక పై స్పందించడానికి నిరాకరించిన కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: టెస్టు జట్టు నుంచి త్రిశతక వీరుడు కరుణ్‌ నాయర్‌ ను  వెస్టిండీస్ సిరీస్ కు ఎంపిక చేయకపోవడం పై వివాదాస్పదంగా మారిన సంగతి తెల్సిందే. అయితే ఈ అంశం పై స్పందించడానికి టీమిండియా సారధి విరాట్ కోహ్లీ నిరాకరించారు. అన్ని నిర్ణయాలు ఒక్కదగ్గరే తీసుకోరని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు ఎంపికైన కరుణ్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. చివరి టెస్టులో అవకాశం వస్తుందని భావించినా హనుమ విహారి అరంగేట్రం చేయడంతో కుదరలేదు. ఈ నిర్ణయాన్ని అప్పట్లోనే సునీల్‌ గావస్కర్‌ సహా మాజీలు తప్పుపట్టారు. వెస్టిండీస్‌ సిరీస్‌కు తప్పకుండా ఎంపికవుతాడని భావించినా మొండిచేయి ఎదురైంది. పూర్తిగా జట్టు నుంచే అతడిని తొలగించడం వివాదాస్పదంగా మారింది.

‘సెలక్టర్లు ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడారు. నేను స్పందించడం సరికాదు. సెలక్టర్లు వారి పని చేస్తారు. ఇక్కడ ఎవరికి కేటాయించిన విధులు వారే చేస్తారు. ఇతర విషయాలపై దృష్టి పెట్టరు. దీని గురించి ఇప్పటికే ఒకరు మాట్లాడి ఉంటే దాన్ని మళ్లీ ఇక్కడికి తీసుకురాకూడదు. చీఫ్‌ సెలక్టర్‌ ఇప్పటికే ఆ ఆటగాడితో మాట్లాడారని నాకు తెలిసింది. నేను దానిపై స్పందించాల్సిన అవసరం లేదనుకుంటా. ఎంపిక చేయడం నా పని కాదు. ఒక జట్టును నడిపించడమే మాకు తెలుసు. ప్రతి ఒక్కరికీ వారి బాధ్యతలు తెలుసు. ప్రజలు ఒకదానికి మరొకదాన్ని ముడిపెడుతున్నారు. అన్ని నిర్ణయాలు ఒకే దగ్గర తీసుకుంటారన్నది నిజం కాదని తెలుసుకోవాలి’ అని కోహ్లీ అన్నాడు.