ఈ నెల 9వ తేదీన కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు జనసేన కవాతు

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ప్రజాపోరాట యాత్ర’ పేరిట ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో చేపట్టిన పర్యటనలకు మంచి స్పందన లభించింది. అధికార పార్టీ అవినీతిని నిలదీస్తూ.. పవన్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జగన్ పార్టీని కూడా ఆయన విమర్శిస్తున్నారు.పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల దమ్మేంటో చూపిద్దామని ఈ మేరకు జనసేన పార్టీ పార్టీ పిలుపునిచ్చింది.
ఈ నెల 9వ తేదీన కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకూ గోదావరి నదిపై ఉన్న రోడ్ కమ్ రైల్ వంతెనపై వేలాదిమంది జన సైనికులతో కవాతు నిర్వహించాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు. ఈ మేరకు తగిన ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులను శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నేతలు జంగారెడ్డిగూడెంలో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 9వ తేదీతో పశ్చిమలో యాత్ర ముగుస్తుంది. 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి వేలాదిమంది జన సైనికులతో కలసి శ్రీ పవన్ కల్యాణ్ గారు కొవ్వూరు నుంచి రాజమండ్రికి కవాతు చేస్తారు. రాజ‌మండ్రి బ్రిడ్జి క‌వాతుని విజ‌య‌వంతం చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. క‌వాతుకి ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి వేలాదిగా శ్రేణులు తరలి వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున త‌గిన ఏర్పాట్లు చేసే ప‌నిలో నిమ‌గ్నమ‌య్యారు. ఇందుకోసం వివిధ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క‌వాతుని విజ‌య‌వంతం చేయ‌వ‌ల‌సిందిగా పార్టీ శ్రేణుల‌కి జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.