తల్లి మృతదేహం పై కూర్చొని కుమారుడి అఘోరా పూజలు

వాస్తవం ప్రతినిధి: అఘోరాగా మారిన ఓ కుమారుడు తల్లికి తమదైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించాడు. అతనికి మరికొందరు అఘోరాలు తోడుగా వచ్చారు. అందరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జడుసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలప్రకారం.. జిల్లాలోని తిరువెరుంబూర్ అరియమంగళంలో మేరీ అనే మహిళ చనిపోయింది. దీంతో అఘోరా గామారిన ఆమె కుమారుడు మణికంఠన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చాడు. వారణాసి వెళ్లి అఘోరాగా మారిపోయిన అతను తల్లి శవంపై కూర్చుని అంత్యక్రియలు నిర్వహించాడు. భౌతికకాయానికి ప్రత్యేక పూజలు చేస్తూ.. ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ.. చిత్రవిచిత్రమైన పూజలు చేస్తుంటే.. అతడి అనుచరులు ఢమరుకం వాయిస్తూ, శంఖం ఊదుతూ పెద్ద పెట్టున శబ్దాలు చేశారు. ఆతర్వాత తల్లి భౌతికకాయానికి దీపారాధనలు చేసి ఖననం చేశారు.