జాతిపిత మహాత్మా గాంధీ కి అమెరికా పౌర పురస్కారం

వాస్తవం ప్రతినిధి: భారత జాతిపిత మహాత్మా గాంధీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తుంది. శాంతి, అహింస కోసం కృషి చేసిన బాపూజీని గోల్డ్ మెడల్‌తో సన్మానించాలని అమెరికా భావిస్తుంది. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కరోలిన్ మలోనే ఈ ప్రతిపాదన చేశారు. మహాత్మా గాంధీని గోల్డ్ మెడల్‌తో సన్మానించేందుకు అమెరికా చట్టసభ ప్రతినిధులు ప్లానేశారు. అమెరికా రాజకీయాల్లో పలుకుబడి కలిగిన ఓ అరడజను మంది చట్టసభ ప్రతినిధులు.. దీని కోసం చట్టసభలో ప్రతిపాదన కూడా చేశారు. ఆ బృందంలో నలుగురు భారత సంతతి సభ్యులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 23వ తేదీనే ఈ ప్రతిపాదన జరిగింది. చట్టసభ ప్రతినిధులు అమీ బిరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమిలా జయపాల్‌లు ఆ టీమ్‌లో ఉన్నారు. అమెరికాలోని సంయుక్త సభలు.. అత్యున్నత పౌర పురస్కారం కింద గోల్డ్ మెడల్‌ను ఇస్తుంది. చాలా తక్కువ మంది విదేశీయులు ఇప్పటి వరకు ఈ అవార్డును గెలుచుకున్నారు. మదర్ థెరిసా(1997), నెల్సన్ మండేలా(1998), పోప్ జాన్ పాల్-2(2000), దలైలామా(2006), ఆంగ్ సాన్ సూకీ(2008), మొహమ్మద్ యూనిస్(2010), షిమోన్ పీరస్(2014)లు గతంలో అమెరికా పౌర పురస్కారాన్ని అందుకున్నారు.