నియంత్రణ రేఖ దగ్గరగా వెళ్లాం…కానీ,పాక్ గగనతలం లోనే ఉన్నాం: హైదర్

వాస్తవం ప్రతినిధి: ఆదివారం మధ్యాహ్నం 12.13గంటల ప్రాంతంలో పూంచ్‌ జిల్లాలోని గుల్పూర్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌కు చెందిన తెలుపు రంగు హెలికాప్టర్‌ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.  అయితే ఆ హెలికాప్టర్ లో పీవోకే ప్రధాని హైదర్ ఉన్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై హైదర్ తాజాగా స్పందిస్తూ…. ‘నియంత్రణ రేఖకు దగ్గరగా వెళ్లాం కానీ మేం పాకిస్థాన్‌ గగనతలంలోనే ప్రయాణించా’మని తెలిపారు. ‘నా మంత్రివర్గంలోని ఓ మంత్రి సోదరుడు చనిపోతే నివాళులర్పించి, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కహుతా ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడేందుకు తెలుపు రంగు హెలికాప్టర్‌లో బయలుదేరాం. నేను నాతో పాటు మరో ఇద్దరు మంత్రులు, నా సిబ్బంది అందులో ఉన్నాం. అయితే అబ్బాస్‌పూర్‌ ప్రాంతం దాటి వెళ్లే సమయంలో భారతీయ ఆర్మీ అకస్మాత్తుగా మా హెలికాప్టర్‌పై కాల్పులు జరిపిందని,అయితే అదృష్టవశాత్తూ మేం ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా క్షేమంగా బయట పడగలిగామని ఆయన తెలిపారు. అయితే మేము నియంత్రణ రేఖకు దగ్గరగా వెళ్ళాం కానీ,పాక్ గగన తలంలోనే ఉన్నాం అని ఆయన స్పష్టం చేశారు . అయినప్పటికీ ఇది పౌర హెలికాప్టర్‌. దీనిపై భారతీయ ఆర్మీ కాల్పులు జరపాల్సిన అవసరం లేదు’ అని, ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి అని  ఆయన వెల్లడించారు. అయినా సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్‌ అయితే.. భారత్‌ ఆర్మీకి సమాచారం అందించాలి, కానీ ఇది పౌరహెలికాప్టర్‌.. వారికి సమాచారం అందించాల్సి అవసరం లేదు. దీనిని పాక్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని ఆయన పేర్కొన్నారు.