ఉభయ కొరియా మధ్య మందుపాతరల తొలగింపు

వాస్తవం ప్రతినిధి: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య భారీగా బందోబస్తు కలిగిన సరిహద్దు పొడవునా కొన్ని మందుపాతరలను ఇరు దేశాల బలగాలు సోమవారం తొలగించడం ప్రారంభించాయని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొంత కాలంగా ఉభయ కొరియా ల మధ్య స్నేహపూర్వక వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలూ ఇప్పుడు ఇరు దేశాల మధ్య కలిగిన సరిహద్దు పొడవునా మందుపాతరలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాయి.  ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగించి, విశ్వాసం పెంచుకునేందుకు కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్‌లో అధ్యక్షులు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, మూన్‌ జే ఇన్‌ల మధ్య గత నెల్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పాన్ముజోమ్‌లో జాయింట్‌ సెక్యూరిటీ ఏరియా (జెఎస్‌ఎ)లో మందుపాతరలన్నింటినీ వచ్చే 20 రోజుల్లోగా తొలగించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియా వైపు మిలటరీ ఇంజనీర్లు అత్యంత ప్రమాదకరమైన ఈ పనులను చేపట్టారు. ఉత్తర కొరియా వైపు ఇంకా ఈ కార్యక్రమం ప్రారంభమైందో లేదో ఇంకా సమాచారం అందలేదు. జెఎస్‌ఎ నుండి గార్డ్‌ పోస్ట్‌లను, ఆయుధాలను తొలగించాలని ఒప్పందం కోరుతోంది. ఆ సరిహద్దుల్లో వుండే బలగాలు నిరాయుధులుగా వుండాలనేది ఇరు పక్షాల భావన.