ఫాన్స్ కు క్షమాపణలు చెప్పిన విజయ్ దేవరకొండ

వాస్తవం సినిమా: ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత, యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘నోటా’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. విజయవాడలో అభిమానుల కోసం ‘పబ్లిక్ మీట్’ పేరిట పెట్టిన కార్యక్రమానికి విజయ్ తో పాటు హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కూడా వచ్చింది. అక్కడ తనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ను చూసిన విజయ్, వారికి క్షమాపణలు చెప్పాడు. ఓ చిన్న హాల్ లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం, విజయ్ కోసం వచ్చిన వందలాది మంది బయటే ఉండిపోవడంతో స్పందించాడు.

“బయట ఉన్నవాళ్ళని చూడలేకపోతున్నాను. సారీ. తరువాత వచ్చినప్పుడు ఇంకా పెద్ద హాల్ ఏర్పాటు చేస్తా. ఇంత చిన్న హాల్ సరిపోలేదు. క్షమాపణ చెప్తున్నాను. అందరు జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి” అన్నాడు. చాలా రోజుల తరువాత తాను విజయవాడకు వచ్చానని, ఇక్కడి ప్రజలకు సినిమా, రాజకీయాలంటే ఎంతో ఇష్టమని, ఆ రెండు అంశాల కలబోతే ‘నోటా’ అని చెప్పాడు. అభిమానులకు వినోదాన్ని అందించడమే ఈ సినిమా ఉద్దేశమని చెప్పాడు. ఇంకో నాలుగు రోజుల్లో థియేటర్లలో కలుస్తానని అన్నాడు. సినిమాను ఆదరించాలని విజయ్ దేవరకొండ కోరాడు.