జపాన్ ను వణికిస్తున్న టైపూన్

వాస్తవం ప్రతినిధి: ప్రచండ శక్తితో దూసుకొస్తున్న టైఫూన్‌ జపాన్ ను వణికిస్తుంది. దక్షిణాన ఉన్న ఒకినావా ద్వీపంపై శనివారం దీని ప్రభావం ఎక్కువగా ఉండడం తో  పశ్చిమ, తూర్పు జపాన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 216 కి.మీ.ల వేగంతో వీస్తున్న ఈదురుగాలులతో జనజీవనం అతలాకుతలమవుతోంది. గాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో 17 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఆదివారం నాటికి టైఫూన్‌ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా తీవ్రత ఉండవచ్చని ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యాయి. ట్రక్కులను సైతం తిరగేస్తున్న గాలులకు నాహా తదితర పట్టణాల్లో చెట్లు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2 లక్షల ఇళ్లకు విద్యుత్తు నిలిచిపోగా.. 700 మందిని ఒకినావాలోని సహాయక శిబిరాలకు తరలించారు. పశ్చిమ జపాన్‌లో 386 విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఒసాకా రీజన్‌లో అన్ని రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పశ్చిమ జపాన్‌ రైల్వే తెలిపింది. వాకాయామా, పశ్చిమ జపాన్‌ తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది.