ఇండొనేషియాలో భీబత్సం సృష్టించిన సునామీ..420 కి చేరిన మృతుల సంఖ్య

వాస్తవం ప్రతినిధి: ఇండొనేషియాలో శుక్రవారం సంభవించిన తీవ్ర భూకంపం తరువాత ఏర్పడిన సునామీ బీభత్సం సృష్టించింది. 20 అడుగుల ఎత్తులో సునామీ అలలు తీరాన్ని తాకగా, పలు ప్రాంతాలు నీటమునిగాయి. అలల ధాటికి దాదాపు 420 మందికిపైగా మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరో 500 మందికిపైగా గాయాల పాలయ్యారని అధికారులు వెల్లడించారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు వందలాది మంది ఆచూకీ తెలియరావడం లేదని భారీగా ఫిర్యాదులు అందాయి. ఒక్కసారిగా అలలు తీర ప్రాంతాలవైపు దూసుకురావడంతో ఎటూ పోలేని స్థితిలో అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ సునామీ భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని మిగిల్చింది. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపామని ఇండొనేషియా అధ్యక్షుడు తెలిపారు.