కవానా పై దర్యాప్తు తిరిగి చేపట్టాలి: ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికా సుప్రీం కోర్టు నామినీ బ్రెట్‌ కవానా నేపథ్యంపై దర్యాప్తును తిరిగి చేపట్టాల్సిందిగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ఎఫ్‌బిఐని ఆదేశించారు. కవానాపై ఇటీవల లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ ఆరోపణలు సెనేట్‌ను కుదిపివేయడమే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. మొదటగా కవానా అభ్యర్ధిత్వాన్ని ధ్రువీకరించిన సెనెటర్‌ జెఫ్‌ ఫ్లాక్‌, డెమోక్రాట్లతో జరిగిన ప్రైవేటు సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడుతూ, ఆయన వ్యవహార శైలిపై విచారణను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో, కవానా భవితవ్యం అనిశ్చితిలో పడింది. మరో వారం పాటు ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. కవానా నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో విచారించాల్సిందిగా ఎఫ్‌బిఐని కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఆయన అభ్యర్ధిత్వ ఖరారు మరింత ఆలస్యమయ్యేలా కనపడుతుంది.