అనుమతి లేకుండా భారత గగన తలం లోకి అడుగుపెట్టిన పాక్ హెలికాప్టర్

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌కు చెందిన హెలికాప్టర్ ఒకటి ఎలాంటి అనుమతులు లేకుండా భారత గగనతలం లోకి అడుగుపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దానిని చూసిన వెంటనే ఇండియన్ ఆర్మీ కూల్చడానికి ప్రయత్నించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నియంత్రణ రేఖ దాటి కిలోమీటర్ కంటే ఎక్కువ రాకూడదు. అదే ఎయిర్‌క్రాఫ్ట్ అయితే పది కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోని పాకిస్థాన్‌కు చెందిన హెలికాప్టర్ ఒకటి ఎల్‌వోసీ దాటి 300 మీటర్ల వరకూ వచ్చిందని,అయితే ఆదివారం మాత్రం అది నిబంధనలను అతిక్రమించినట్లు తెలిపారు. భారత గగనతలాన్ని ఉల్లంఘించడంగా ఈ ఘటనను చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఓ తెల్లని పాకిస్థాన్ హెలికాప్టర్ పూంచ్ పర్వతం పక్కగా వెళ్లడం అందులో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ దానిని కూల్చేయడానికి ఫైరింగ్ కూడా జరిపింది. ఆ సౌండ్ కూడా వీడియోలో వినిపిస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం 12.13 గంటల సమయంలో పాక్ హెలికాప్టర్ కనిపించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.