పాక్ తో క్రికెట్ సంబంధాల పై స్పందించిన రాజీవ్ శుక్లా

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఆ దేశ బోర్డుతో ఉన్న వివాదాన్ని రెండు బోర్డుల అధికారులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. ఐసీసీ చుట్టూ తిరిగే కంటే ఇదే మంచిదని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడాలని తమకూ ఉందని, అయితే కొన్ని అంశాల కారణంగా దీనికి భారత ప్రభుత్వ అనుమతి కావాలని శుక్లా చెప్పారు. ఐసీసీ లేదా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎక్కడ మ్యాచ్‌లు నిర్వహించినా పాకిస్థాన్‌తో ఇండియా ఆడుతూనే ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏషియాకప్‌లో భాగంగా తటస్థ వేదికపై ఆడామని తెలిపిన ఆయన అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని శుక్లా తేల్చి చెప్పారు. 2014లో రెండు దేశాల బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇప్పటికే రెండు సిరీస్‌లు జరగాల్సి ఉంది. అయితే రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. దీంతో నష్టపరిహారంగా తమకు 7 కోట్ల డాలర్లు బీసీసీఐ నుంచి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ పాక్ బోర్డు ఐసీసీ దగ్గరికి వెళ్లింది.