గాయం కారణంగా మూడునెలల పాటు ఆటకు దూరం కానున్న మరో ప్రముఖ  క్రికెటర్

వాస్తవం ప్రతినిధి: బంగ్లా క్రికెటర్ల కు వరుసగా గాయాల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే ఈ గాయాల బారిన పది ప్రముఖ ఆటగాళ్ళు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బంగ్లా సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు ఢాకాలో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఆ తరువాత దాదాపు మూడు నెలల పాటు అతడు ఆటకు దూరంకానున్నాడు. చేతి వేలి గాయం కారణంగా రెండు రోజుల క్రితం ముగిసిన ఆసియాకప్‌లో ఆ జట్టు ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.  ఎడమచేతి వేలికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఇంకా ఆలస్యం చేస్తే అది కాస్త మణికట్టు మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని షకిబ్ పేర్కొన్నాడు. మరికొన్ని రోజుల పాటు ఆలస్యం చేస్తే పరిస్థితి చాలా ప్రమాదంగా ఉండేదని డాక్టర్లు చెప్పినట్లు అతడు తెలిపాడు. సర్జరీ తరువాత కనీసం 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ..దీంతో మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని వివరించాడు. త్వరలో స్వదేశంలో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో జరిగే సిరీస్‌లకు అతడు ఇంటికే పరిమితంకానున్నట్లు తెలుస్తుంది.