రాఫెల్ వివాదం పై తాజాగా స్పందించిన మాజీ సైన్యాధిపతి

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం చేసుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఓ సంస్థకు లాభాలు వచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించారని కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ విషయంపై తాజాగా కేంద్ర మంత్రి, భారత మాజీ సైన్యాధిపతి జనరల్‌ వీకే సింగ్‌ స్పందించారు. ఆయన తాజాగా దుబాయ్ లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ కి మద్దతు తెలిపారు. యుద్ధ విమానాలను తయారు చేసే విదేశీ సంస్థే తన స్థానిక భాగస్వామిగా ఏదైనా ఇతర సంస్థను ఎంపిక చేసుకుంటుంది. రెండు దేశాల ప్రభుత్వాలు చేసుకునే ఒప్పందంలో స్థానిక భాగస్వామి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు అని ఆయన తెలిపారు. డసో ఎంపిక చేసుకున్న పలు సంస్థల్లో అనిల్‌ అంబానీకి చెందిన సంస్థ కూడా ఒకటిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.