గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక మలుపు

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా పేర్కొంటున్న పరశురామ్‌ వాగ్మేర్‌ సిట్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం తో ఈ కేసు లో కీలక మలుపు చోటుచేసుకుంది.  ఈ కేసు నమోదైనప్పటి నుంచి సిట్‌ చూపు తన వైపే ఉందని, నేరం ఒప్పుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చేవారని పేర్కొన్నారు. గౌరీలంకేశ్‌ హత్య కేసుపై సిట్‌ ఏర్పాటు చేసినప్పుడు అధికారులు నేరుగా నా వద్దకే వచ్చారు. నేరం ఒప్పుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత మాకు బెదిరింపులు మొదలయ్యాయి. అనంతరం నాకు రూ.25లక్షలు ఇచ్చి నేరం ఒప్పుకోమన్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో నిందితుడు మనోహర్‌ కూడా మీడియా తో మాట్లాడుతూ..‘ఈ హత్యకేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు.అయినా నన్నూ నా కుటుంబాన్ని బెదిరించి నాతో నేరం ఒప్పించారు’ అంటూ వ్యాఖలు చేశారు. అయితే నిందితుల వ్యాఖ్యలపై సీనియర్‌ సిట్‌ అధికారులను వివరణ కోరగా దీనిపై స్పందించడానికి వారు నిరాకరించారు. అయితే నిందితుల వ్యాఖ్యలను సిట్‌ అధికారులెవ్వరూ ఖండించకపోయేసరికి దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.

‘లంకేశ్‌’ పత్రిక ఎడిటర్‌ అయిన గౌరీలంకేశ్‌ గతేడాది సెప్టెంబర్‌ 5న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే