మా సత్తా ఏంటో త్వరలో మావోలకు చూపిస్తాం: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్

వాస్తవం ప్రతినిధి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ను ఉచ్చులోకి లాగి మావోయిస్టులు హతమార్చారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటామన్నారు.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల విషయంలో పోలీసులు వైఫల్యం కనిపిస్తోందన్న విమర్శలపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. ఈ విషయంలో మావోలు సవాలు విసిరారని, త్వరలోనే బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. కేవలం సంచలనం కోసమే మావోలు ఈ పనికి పాల్పడ్డారని తెలిపారు. నక్సల్ ఆపరేషన్‌లో ఒడిశాకు చెందిన గోండు జాతి మహిళలు పాల్గొన్నారని పేర్కొన్న డీజీపీ, వారికి స్థానికంగా ఎవరు సహకరించిందీ మరో రెండు రోజుల్లో వెల్లడిస్తామన్నారు.

  ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. మావోయిస్టులకు ఎవరు సహకరించిందీ తెలిసిందని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. హత్యల్లో పాల్గొన్న వారిలో ఎక్కువమంది ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారేనని, వారిలో ఎక్కువ మంది గోండు మహిళలు ఉన్నారని వివరించారు.