యూఎస్ సుప్రీం కోర్టు నామిని పై లైంగిక ఆరోపణలు

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూఎస్‌ సుప్రీంకోర్టు నామిని గా జస్టిస్‌ బ్రెట్‌ కావెనా ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎంపిక అమెరికా లో తీవ్ర వివాదాస్పదం గా మారింది. కావెనా ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి. కావెనా తమతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏకంగా ముగ్గురు మహిళలు ఆరోపించారు. దీంతో, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఎన్నిక ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ వివాదంపై సెనేటర్ల మండలి విచారణ జరుపుతోంది. ఆ విచారణకు కావెనాపై ప్రధానంగా ఆరోపణలు చేసిన ప్రొఫెసర్‌ క్రిస్టీన్‌ బ్లాసీ ఫోర్డ్‌ హాజరయ్యారు. గతంలో కెవనా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆ ఘటన తన జీవితాన్ని సమూలంగా మార్చేసిందని, చాలాకాలం పాటు ఆ విషయాన్ని ఇతరులతో చెప్పడానికి భయపడ్డానని ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు. ‘అమెరికా పౌరురాలిగా జరిగింది చెప్పడం నా బాధ్యత. అందుకే నేను ఇక్కడున్నా తప్ప మరో కారణం లేదు. ఆ రోజు నన్ను వేధించింది కావెనానే. నేను వందశాతం నమ్మకంగా ఉన్నా’, అని క్రిస్టీ కన్నీళ్లు పెడుతూ చెప్పారు. తొమ్మిది గంటలపాటు సాగిన ఆ విచారణలో చాలామంది పౌరులు ఆమెకు మద్దతుగా నిలిచారు.