మరోసారి పాక్ ఉగ్రవాదికి బాసటగా నిలిచిన డ్రాగన్

వాస్తవం ప్రతినిధి: చైనా మరోసారి పాక్ ఉగ్రవాదికి బాసటగా నిలిచి తన అక్కసును వెళ్లగక్కింది. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, జైషే-ఇ-మహమ్మద్‌(జేఈఎం) అధినేత మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణిస్తూ అతడిపై నిషేధం విధించాలన్న ఉద్దేశ్యం తో చేసిన భారత ప్రయత్నాన్ని చైనా మరోసారి మొకాలడ్డింది. ఈ నేపధ్యంలో మసూద్‌ ఉగ్రవాది అనేందుకు సరైన ఆధారాలు లేవని డ్రాగన్‌ పేర్కొంది. మసూద్‌పై అంతర్జాతీయంగా నిషేధం విధించాలని కోరుతూ గత రెండేళ్లుగా భారత్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంది. భారత్‌కు అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు మద్దతు తెలుపుతున్నప్పటికి,. కానీ వీటో అధికారం కలిగిన చైనా మాత్రం మసూద్‌ను వెనకేసుకొస్తూ భారత్‌ ప్రయత్నాలను అడ్డుకుంటూ వస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా.. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి నిషేధం విధించాలని భారత్‌ మరోసారి పిటిషన్‌ వేయగా.. దానికి డ్రాగన్‌ అడ్డుతగిలింది. ‘అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో వస్తే మేం దానికి మద్దతు ఇస్తాం. కానీ మసూద్‌ విషయంలో భారత్‌, పాకిస్థాన్‌ వాదనలు వేర్వేరుగా ఉన్నాయి. మసూద్‌ ఉగ్రవాదని భారత్‌ అంటుంటే.. పాక్‌ వాదన మాత్రం వేరేగా ఉంది. అందుకే మసూద్‌పై నిషేధం విధించాలనే పిటిషన్‌ను నిరాకరిస్తున్నాం. సరైన ఆధారాలు లేకుండా ఓ వ్యక్తిని ఉగ్రవాది అని నిషేధించలేం’ అని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యి వెల్లడించారు. భారత్‌తో మాకు సత్సంబంధాలు ఉన్నాయంటూనే.. డ్రాగన్‌ పాక్‌ను వెనకేసుకొచ్చింది. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్‌ చేస్తున్న పోరాటాన్ని డ్రాగన్‌ అభినందించడం కూడా విశేషం.