ఒక్క శబరిమలతో ఆగదు : జస్టిస్‌ ఇందూ మల్హోత్రా

వాస్తవం ప్రతినిధి: దేశంలో లౌకికవాద వాతావరణాన్ని కొనసాగించాలంటే లోతైన అర్దాలు ఉన్న మతపరమైన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.
ఏ వయసు మహిళలైనా శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవచ్చునని సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఈ తీర్పుని సమర్దిస్తుంటే.. కొందరు మాత్రం మతాలకు వారి ఆచారాలకు గౌరవం ఇవ్వాలంటూ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇలా వ్యతిరేకించిన వారిలో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్న మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా ఉన్నారు.
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా ఉన్నారు. ఇందూ మల్హోత్రా మాత్రం ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని మాత్రం వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సమస్య ఒక్క శబరిమలతో ఆగదు, ఇతర ప్రార్ధనా స్థలాలపైనా చూపుతుందన్నారు.
భారతదేశం వేర్వేరు మతపరమైన ఆచారాలను కలిగి ఉందన్నారు. రాజ్యాంగం కేవలం ఎవరైనా ఒక మతాన్ని గౌరవించటానికి ,పాటించటానికి అనుమతిస్తుందన్నారు.. అతను లేదా ఆమె నమ్మే ఆచరించే మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవటానికి కాదన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఇందూ మల్హోత్రా వ్యతిరేకించడంతో 4-1తేడాతో ఈ తీర్పు వెలువడింది.