రేవంత్‌ నివాసంలో ముగిసిన సోదాలు ..రూ.20 కోట్ల అక్రమాస్తులు ..!?

వాస్తవం ప్రతినిధి: ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారన్న ఫిర్యాదులతో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో సుదీర్ఘంగా జరిగిన ఐటీ సోదాలు ముగిశాయి. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఐటీ అధికారులు రేవంత్ నివాసం నుంచి వెళ్లిపోయారు. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన తనిఖీలు దాదాపు 44గంటలపాటు సాగి శనివారం తెల్లవారుజాము వేళకు ముగిశాయి.
ఈ దాడుల్లో రూ.20 కోట్లు లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ సొమ్ము రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.సోదాల సందర్భంగా అధికారులు రేవంత్‌రెడ్డి ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్లతోపాటు గురువారం స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ హార్డ్‌డిస్కులను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీకి చెందిన నిపుణులను పిలిచి అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో వీటిని విశ్లేషించి అందులో ఉన్న సమాచారం వెలికితీసి నివేదిక సమర్పించనున్నారు.రేవంత్ రెడ్డి, ఆయన భార్యను కలిపి దాదాపు 31 గంటలపాటు అధికారులు విచారించారు. 150 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయించుకున్నారు. అక్టోబరు 3న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

మరోవైపు రేవంత్‌ రెడ్డి నివాసంలో దాడులు రాజకీయ కక్ష్య సాధింపులో భాగమేనని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.