అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ  రాష్ట్రంలో అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరలను పరిశీలించిన తరువాత కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ,.. “ఈ ఏడాది రూ.280 కోట్లతో 95 లక్షల చీరలను రాష్ట్రంలోనే తయారు చేయిస్తున్నాము. వాటిలో ఇప్పటికే 50 లక్షల చీరలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి. మిగిలినవి కూడా త్వరలోనే సిద్దం అవుతాయి. గత ఏడాది జరిగిన లోపాలను సవరించుకొని ఈసారి మంచి నాణ్యమైన, అందమైన రంగులలో చీరలు తయారు చేయించాము. ఈసారి 80 రంగులలో చీరలు నేయించాము. ఉత్తర తెలంగాణా జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా 9 మీటర్లు పొడవుండే 5 లక్షల చీరలు నేయించాము. బతుకమ్మ చీరల తయారీ వలన ఒక్క సిరిసిల్ల ప్రాంతంలోనే సుమారు 16,000 మందికి 6 నెలల పాటు పని కల్పించాము. రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమైన బతుకమ్మ పండుగకు చీరలు అందించడం, వాటి కోసం చేనేత, మరమగ్గాల కార్మికులకు పని కల్పించడం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని అన్నారు.