సూకీ కి కెనడా గౌరవ పౌరసత్వం రద్దు

వాస్తవం ప్రతినిధి: మయన్మార్‌లో కొనసాగుతున్న రోహింగ్యా సంక్షోభం పట్ల నిర్లిప్తతతో వ్యవహరిస్తున్న ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్‌ సూకీకి గతంలో ప్రదానం చేసిన గౌరవ పౌరసత్వాన్ని కెనడా రద్దు చేసినట్లు తెలుస్తుంది. ఈ అంశంపై కెనడా పార్లమెంట్‌ గురువారం నాడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో దీర్ఘకాలం నిర్బంధంలో వున్న నోబుల్‌ శాంతి పురస్కార విజేత ఆంగ్‌సాన్‌ సూకీకి 2007లో కెనడా ప్రభుత్వం తమ దేశ గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రోహింగ్యా ముస్లిం ల మైనార్టీ లపై సైన్యం కొనసాగిస్తున్న ఆగడాల పట్ల కెనడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  ఈ ఆగడాల పట్ల నిర్లిప్త వైఖరిని అనుసరిస్తుండటంతో సూకీ అంతర్జాతీయంగా ఆర్జించిన ప్రతిష్ట మసకబారిందని కెనడా పార్లమెంట్‌ తన తీర్మానంలో పేర్కొంది. 2007లో ఆమెకు ప్రదానం చేసిన గౌరవ పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటూ పార్లమెంట్‌ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిందని కెనడా విదేశాంగ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ ప్రతినిధి ఆడమ్‌ ఆస్టెన్‌ చెప్పారు.