భారత్ లో పర్యటించడానికి ఆసక్తి కనబరుస్తున్న ట్రంప్

వాస్తవం ప్రతినిధి:  భారత్ లో పర్యటించడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని, అక్కడికి రావాలంటే అందుకు సమయం, ఇతర బాధ్యతలపై ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. అయితే తగిన సమయంలోనే భారత్‌ను సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తున్నారనైతే చెప్పగలను అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ట్రంప్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు ట్రంప్‌ హాజరవుతారా అని ప్రశ్నించగా సమయం, ఇతర బాధ్యతలు పరిగణలోకి తీసుకొని శ్వేతసౌధం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని, అమెరికా, భారత్‌కు చెందిన వివిధ విభాగాల అధికారుల మధ్య ఇప్పటివరకు 40 సార్లు చర్చలు జరిగాయని తెలిపారు.