ఇండోనేషియా లో భారీ భూకంపం

వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇండోనేషియా లోని మధ్య సులవెసి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. డోంఘాల పట్టణానికి ఈశాన్యంలో 56 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనితో తీర ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శుక్రవారం వేకువ జామున ఇదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభించింది. భూకంపం తీవ్రతకు ఒకరు మృతి చెందగా, పదిమంది వరకూ గాయపడగా, పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు కనొసాగిస్తుండగానే సాయంత్రం మరోసారి భూకంపం రావడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. దీనితోడు సునామీ హెచ్చరికలు కూడా జారీ అవ్వడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.