సర్జికల్ స్త్రైక్స్ కు రెండేళ్లు…..పరాక్రమ్ పర్వ్ ప్రారంభించిన మోదీ  

వాస్తవం ప్రతినిధి: భారత సైన్యం పాక్‌ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ మెరుపు దాడులు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని మిలిటరీ స్టేషన్‌లో ‘పరాక్రమ్‌ పర్వ్‌’ పేరుతో ఆర్మీ ఎగ్జిబిషన్‌ ఒకటి ప్రారంభించారు. 2016 సెప్టెంబరులో సైన్యం మెరుపు దాడులు(సర్జికల్‌ స్ట్రైక్స్) చేపట్టింది. పరాక్రమ్‌ పర్వ్‌ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముందు కోణార్క్‌ యుద్ధ స్తూపం వద్ద నివాళులర్పించిన ఆయన భారత సైన్యం ఎంతో ధైర్యసాహసాలతో మెరుపుదాడులు చేపట్టడాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో భారత సైన్యం బలం, జాతి నిర్మాణానికి వారు అందిస్తున్న సహకారానికి సంబంధించిన అంశాలు ఉంటాయని రక్షణ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. పరాక్రమ్‌ పర్వ్‌ను ప్రారంభించిన అనంతరం మోదీ జోధ్‌పూర్‌ వైమానిక స్థావరంలో జరిగిన సంయుక్త కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌, త్రివిధ దళాధిపతులు, రక్షణ విభాగంలోని పలువురు కీలక అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తుంది.