తూత్తుకూడి ఘటన భాదితులకు భరోసా కల్పించిన తమిళనాడు ప్రభుత్వం

వాస్తవం ప్రతినిధి: తూత్తుకుడి పోలీసు కాల్పుల ఘటనలో మృతి చెందిన, అలానే ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారి  కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం భరోసా కల్పించింది. ఈ నేపధ్యంలో ఆ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అలానే తీవ్రంగా గాయపడిన వారి  కుటుంబాలలోని దాదాపు 19 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో వారికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరికి రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, సామాజిక సంక్షేమం, పౌష్టికాహార పథకం విభాగాల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో తూత్తుకుడిలో స్టెరిలైట్‌ రాగి కర్మాగారం, దాని విస్తరణకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించారు. ఆ సమయంలో హింస చోటుచేసుకోవడంతో పోలీసులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది మృతి చెందారు. సంబంధిత ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి.. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సదరు కుటుంబాలకు ఆసరా ఉండేలా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు 19 మందికి  ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్ణయించింది. అందులో భాగంగా వారికి నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రి అందజేశారు. తూత్తుకుడికి చెందిన పలువురు అర్హులకు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలను కల్పించేలా  జిల్లా కలెక్టర్‌ సందీప్‌ నండూరి కూడా చర్యలు చేపట్టారు.