శబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

వాస్తవం ప్రతినిధి: కేరళలోని పశ్చిమ కనుమల పర్వత సాణువుల్లో, పంబా నదీ తీరంలో కొలువైన అయ్యప్పను దర్శించుకునేందుకు అన్ని వయసుల మహిళలూ వెళ్లవచ్చని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పును వెలువరించింది. మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. రుతుస్రావం సాకుగా చూపి, మహిళలను దేవుడికి దూరం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయన్న విషయాన్ని మరువరాదని, అయితే, భక్తుల మనోభావాల కోణం నుంచి కూడా కేసును పరిశీలించామని, అయితే, భగవంతుడు ఎక్కడున్నా ఒకటే అని చెప్పుకుంటున్న వేళ, మిగతా అయ్యప్ప దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై లేని ఆంక్షలు, శబరిమలలో ఉండరాదని పేర్కొంది.

కాగా, సుప్రీంకోర్టు నేడు వెలువరించిన ఈ తీర్పుపై ఆలయ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాము పోరాటం కొనసాగిస్తామని రాహుల్‌ ఈశ్వర్‌ అన్నారు. ఈ తీర్పు ఆలయ విశ్వాసాలను దెబ్బ తీసేదిగా ఉందని ఆయన అన్నారు. ఈ తీర్పుతో ప్రతి ఆలయం, ప్రతి చర్చి, ప్రతి మసీదు తమ స్వయం పాలనా హక్కును కోల్పోతాయని ఆయన చెప్పారు.