వరవరరావు సహా ఐదుగురి అరెస్టుపై కలుగజేసుకోలేం : సుప్రీంకోర్టు

వాస్తవం ప్రతినిధి: భీమా కోరెగావ్‌ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇవాళ తీర్పు చెబుతూ.. ఇవి రాజకీయ అల్లర్లు కావని… వరవరరావుతో పాటు మరో నలుగురి అరెస్టులో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

అలాగే సిట్ దర్యాప్తు కావాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. వరవరరావుతో పాటు అరెస్టయిన మరో నలుగురి గృహనిర్బంధాన్ని నాలుగు వారాల పాటు పొడిగించింది. భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావుసహా మరో ఐదుగురి ఇళ్లపై పుణె పోలీసులు దాడులు నిర్వహించడంతో పాటు వారిని అరెస్ట్ చేసి.. పుణెకు తరలించారు.