కామ్తానాథ్ మందిరంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీరాముని తపోభూమి చిత్రకూట్ కి వెళ్లి ముందుగా హెలికాప్టర్ లో కామద్ గిరి పర్వత ప్రదక్షిణ చేశారు. అనంతరం అక్కడి కామ్తానాథ్ మందిరానికి వెళ్లి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ తన నుదుటిపై త్రిపుట పెట్టుకున్నారు. మానస సరోవర్ యాత్ర అనంతరం శివభక్తుడైన రాహుల్ రామభక్తిలో మునిగిపోవడం కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

రెండేళ్ల క్రితం 17 సెప్టెంబర్ 2016లో రాహుల్ చిత్రకూట్ వచ్చినపుడు ఇక్కడి మహంత్ రామస్వరూపాచార్య ఆయనకు ప్రధానమంత్రి కాగలరని ఆశీర్వదించారు. గతంలో రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ కూడా భగవాన్ కామ్తానాథ్ ని బలంగా నమ్మేవారు. ఇప్పుడు ఇదే కోవలో రాహుల్ కూడా కామ్తానాథ్ స్వామి దర్శనానికి వెళ్లినందువల్ల వాళ్ల మాదిరిగానే ఆయన కూడా ప్రధానమంత్రి కావడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి.