ఆ జట్టును తక్కువ అంచనా వేయొద్దు: శిఖర్ ధావన్

వాస్తవం ప్రతినిధి: భారత్-బంగ్లా దేశ్ ల మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తోటి ఆటగాళ్ల కు కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో టైటిల్‌ కోసం జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్‌ జట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయొద్దని తోటి ఆటగాళ్లకు సూచించినట్లు తెలుస్తుంది. బుధవారం జరిగిన సూపర్‌ ఫోర్‌ క్లాష్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘‘ఈ టోర్నమెంట్‌లో అన్ని జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఫైనల్స్‌ పోరు భారత్‌-పాక్‌ మధ్య ఉంటుందని తొలుత అంతా భావించారు. కానీ సరైన ఆట తీరుతో బంగ్లాదేశ్‌ పాక్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ జట్టును తేలిగ్గా అంచనా వేయలేం. దాని కన్నా బలమైన జట్టు అయిన పాక్‌నే అది మట్టి కరిపించింది. మనం ఊహిస్తున్నదానికి వాళ్లు మైదానంలో ఆట ఆడుతున్న దానికీ చాలా తేడా ఉంటోంది. తమది చాలా బలమైన జట్టు అని బంగ్లాదేశ్‌ జట్టు భావిస్తోంది. ఆ జట్టులో ఇప్పుడు మంచి ఆటగాళ్లు ఉన్నారు. బలమైన జట్లతో ఆడేటప్పుడు తీవ్ర ఒత్తిడి మధ్య వ్యూహాత్మకంగా ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. బంగ్లా జట్టు కేవలం 18 ఏళ్ల నుంచే క్రికెట్‌ ఆడుతున్నా ఫైనల్స్‌లో గెలిచేందుకు దానికి ఇంకా సమయం అవసరం. ఒక్కోసారి మన అంచనాలు తప్పొచ్చు. ఏది ఏమైనా శుక్రవారం జరిగే మ్యాచ్‌ కచ్చితంగా మనం గెలిచి తీరాలి.’’ అని శిఖర్‌ ధావన్‌ భారత ఆటగాళ్లకు సూచించాడు. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌ జట్టు ఊహించని రీతిలో విజయాలు నమోదు చేసే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.