రాఫెల్ యుద్ద విమానాల విషయంలో శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాలు బీజేపీ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన పవార్‌ ఓ మరాఠి న్యూస్‌ చానల్‌తో మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏది ఏమైనా యుద్ధ విమానాల ధరలు బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యవహరించిన తీరు మాత్రం ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉందని పవార్ తెలిపారు. మరోవైపు ఈ ఒప్పందం ద్వారా మోదీ నేతృత్వంలోని బీజేపీ భారీగా అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో పవార్‌ మోదీని సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.