యూపీ బీజేపీ ఎమ్మెల్యే ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు!

వాస్తవం ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి,అనంతరం ఆయన ఇంటివైపు గ్రనైట్ విసిరినట్లు తెలుస్తుంది. ఈ ఘటన సర్ధానా ప్రాంతంలో జరిగింది. అయితే ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. సంగీత్ సోమ్ ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు జెడ్ కేటిగిరీ భద్రత ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సంగీత్ సోమ్ ఆయన ఇంటికి వచ్చారు. సంగీత్ సోమ్ ఇంట్లోకి వెళ్లిన కొద్ది సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు స్విప్ట్ కారులో వచ్చి,ఎమ్మెల్యే ఇంటిపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసిరారు. అనంతరం దుండగులు కారులో గేటు ముందు నుంచి ఎమ్మెల్యే ఇంటిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కారులో నుంచి దిగిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఇంటిపై గ్రైనేడ్ విసిరి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇవాళ ఎమ్మెల్యే ఇంటి వద్ద మందుగుండ్లు స్వాధీనం చేసుకున్నామని, ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్‌ఎస్‌పీ అఖిలేశ్ కుమార్ వెల్లడించారు.